Geetha Koumudi-1    Chapters   

ఆరవ కిరణము

సంజయుని సమాధానము

(గీత - 1వ అధ్యాయము)

'ధర్మక్షేత్రే కురుక్షేత్రే' అను శ్లోకముద్వారా ధృతరాష్ట్రుడు వేసిన ప్రశ్నకును ఆ ప్రశ్నలో వ్యక్తము కాబడిన వివిధభావములకును సంజయుడు.

శ్లో. 'దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధన స్తధా |

ఆచార్యముపసంగమ్య రాజావచన మబ్రవీత్‌'||

అనుశ్లోకముతో ప్రారంభించి సమాధానమును చెప్ప నారంభించెను. 'దృష్ట్వాతు' అను పై శ్లోకముయొక్క భావమేమనగా - పాండవులయొక్క సేనలను చూచి ధుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి మాట్లాడ ప్రారంభించెను, అనగా తన భావములను గురువర్యునకు ప్రకటించ నారంభించెను. అని పై శ్లోకమునకు అర్థము. ఈ శ్లోకములో 'తు' అను శబ్దప్రయోగమువల్ల తత్‌ పూర్వశ్లోకము యొక్క భావములకు వ్యతిరేకార్థము ద్యోతకమగుచున్నది అని తెలిసికొనవలసి యున్నది. దాని పూర్వశ్లోకములో ధృతరాష్ట్రుడు వ్యక్తము చేసిన వివిధభావములను మనము లోగడ తెలుసుకొనియున్నాము. ఆ భావములకు విరుద్ధ భావము తెలియపర్చదలచి సంజయుడు యీ శ్లోకములో 'తు' అను శబ్దప్రయోగము గావించెను. 'తు' శబ్దమువల్ల సూచితమైనవై లక్షణ్యములోని వివిధభావములు ఏవనగా -

1. ధృతరాష్ట్రుడు తన ప్రశ్నలో వ్యక్తము చేసిన భావములు ప్రకారము యేమియు జరుగ లేదని సూచించుట, ''తు'' శబ్దముయొక్క మొదటి అర్థము, పాండవులు ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రములో కాలుపెటగనే వారికి ధర్మ బుద్ధి యెక్కువై వారు యుద్ధమును మానుదురేమోయని ధృతరాష్ట్రుడు అనుకున్న ప్రకారము జరుగ లేదనిన్నీ, ఇట్లనే కౌరవులకు అధర్మబుద్ధిపోయి ధర్మబుద్ధితో పాండవులకు అయిదు గ్రామములు యిచ్చి రాజీపడుదురేమోయని యను కున్న ధృతరాష్ట్రుని భావమును నెరవేరలేదనిన్నీ, మరియు పాండవులు ధృతరాష్ట్రుడు యనుకున్నట్లు అధర్మయుద్ధమును చేయలేదనిన్నీ, ఇంకనూ ధృతరాష్ట్రుడు యనుకున్నట్లు పాండవులకు భీష్మ ద్రోణాదులను చూచినమీదట వారితో గెల్చుటకు సాధ్యముకాదను దృష్టభయము పాండవులకు కల్గలేదనిన్నీ, ఈ అన్ని భావములు సూచితమైనవని మొదటి అర్థము.

2. పాండవులకు దృష్టభయము కల్గకపోగా దుర్యోధనునికే దృష్టభయము కల్గినదను వైలక్షణ్యమును సూచించుటకే సంజయుడు 'తు' అనుశబ్దమును ఉపయోగించినాడు అని 'తు' శబ్దమునకు రెండవ అర్థము. దుర్యోధనునకు దృష్టభయము కల్గినదని చెప్పుటకు అయిదు హేతువులు గలవు.

(అ) దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యునివద్దకు స్వయముగా వెళ్ళినాడు యని చెప్పుటలో దృష్టభయము కలదని సూచన యగుచున్నది. రాజుయైనవాడు తన వద్దకు తన యాచార్యుని పిలిపించుకొనవలెను కాని తాను స్వయముగా ఆచార్యునియొద్దకు వెళ్ళుట రాజనీతికి విరుద్ధము. పారమార్ధిక విషయములలో గురువువద్దకు స్వయముగా వెళ్ళుట ధర్మముకాని, ఆర్థిక, రాజకీయ విషయములలో అట్లు వెళ్ళుట ధర్మముకాదు. ఇట్టి పరిస్థితులలో రాజుయైన దుర్యోధనుడు రాజనీతికి విరుద్ధముగా తాను స్వయముగా ద్రోణాచార్యునివద్దకు వెళ్ళుటకు కారణము తనకు కల్గిన దృష్ట భయమే నని స్పష్టపడుచున్నది. పాండవులను, వారి సేనను చూడగానే వారిని జయింపలేము అని దుర్యోధనునకు భయము కల్గుటచేత ధైర్యము చెడి అట్లు గురువుగారి యొద్దకు వెళ్ళుటసంభవించినది అని ఊహించవచ్చును.

(ఆ) ఇంకను దుర్యోధనుడు ద్రోణాచార్యునితో పాండవ సేనలోని మహావీరాగ్రేసరుల నందరిని విపులముగా వర్ణించుటలో వారందరు భీమార్జునులతో సమానులైన మహాశూరులు అని చెప్పి, తన సేనలోనివారలను అట్లు వర్ణించక సామాన్యముగా పేర్కొనినాడు. ఇట్టి వర్ణనకూడ దుర్యోధనుని భయమును సూచించు చున్నదని భావింపవచ్చును.

(ఇ) ఇంకను పాండవసేనలలోనివారిని వర్ణించి తదుపరి తన సేనలోని నాయకులను వర్ణించుటలో ''మదర్థేత్యక్త జీవితాః'' అనగా నాకొరకు యుద్ధములో ప్రాణములను వదులుకొని వచ్చినారని యనుటలో వ్యక్తమైన అశ్లీలవాక్కు దుర్యోధనుని భయమును సూచించుచున్నది.

(ఈ) ఉభయసేనలను వర్ణించిన పిదప భీష్మునిచేత రక్షింపబడుచున్న కౌరవసేనయొక్క బలము 'అపర్యాప్తం' అనిన్నీ, భీమునిచేత రక్షింపబడుచున్న పాండవుల సేనయొక్క బలము 'పర్యాప్తం' అనిన్నీ, దుర్యోధనుడు అనుటలోకూడా ఒక విధముగా భయము సూచితమగుచున్నది. అది ఎట్లన - పర్యాప్తము అనగా పరిమితమనిన్నీ అపర్యాప్తము అనగా అపరమితమనిన్ని అను అర్థములు. ఆరెండు శబ్దములకు యున్నను పర్యాప్తము అనగా చాలును యనిన్ని ఆపర్యాప్తము అనగా చాలదు యనిన్ని అర్థములుకూడ ఆశబ్దములకు యుండుటచేత, కౌరవసేన పాండవసేనలను జయింపచాలదు అను అర్థముకూడా వచ్చుచున్నది గనుక దీనినిబట్టి కూడా దుర్యోధనుని భయము సూచితము.

(ఉ) మరియు సంజయుడు ధృతరాష్ట్రునికి ఉభయ సేనలను గురించి వర్ణించినపిదప కౌరవులు శంఖములను పూరించినారనిన్ని ఆపైన పాండవులు శంఖములను పూరించినారనిన్ని వర్ణించుచూ, పాండవుల శంఖధ్వని ''ధార్తరాష్ట్రాణాం హృదయానివ్యదారయత్‌'' అనగా కౌరవుల గుండెలను పగలకొట్టినట్లుగా భయము కలుగచేసినదని సంజయుడు వర్ణించుటచేతగూడా దుర్యోధనాదుల భయము వ్యక్తమైనది.

3. 'తు' అను శబ్దమునకు 3 వ అర్థము ఏమనగా :- ధృతరాష్ట్రుడు అనుకున్నట్లు అర్జనునికి దృష్టభయము కల్గలేదు గాని అధృష్టభయము కలిగినదని సూచించుటకు ''తు'' అను శబ్దప్రయోగము చేయబడెను. అదృష్టభయము అనగా పాపభయము. పుణ్యపాపములే అదృష్టములు; అనగా దృష్టముకానివి. యుద్ధములో పూజ్యులైన భీష్మ ద్రోణాదులున్నూ బంధువులు అయిన మిగతావారున్ను, చనిపోవుదురనిన్నీ, అట్టివారి మృత్యువుకు తాను కారణభూతుడగు చున్నాడనిన్నీ, అందుచేత తనకు పాపము వచ్చుననిన్నీ, అర్జనునికి అదృష్టభయము కల్గినది, ఈ అదృష్టభయమును పోగొట్టుకొనుటకుగాను అర్జునుడు కృష్ణపరమాత్మను ఆశ్రయించగా, కృష్ణుడు చేసిన భగవద్గీతాబోధచే అర్జనునికి కల్గిన అదృష్టభయము పోయి ధైర్యముతో యుద్ధము చేసెను. అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పెను. అర్జునునికి కల్గిన అదృష్టభయమును గురించియు, దానివలన కలిగిన విషాదమును గురించియు, ఆ విషాదము పోగొట్టుకొనుటకుగాను శ్రీకృష్ణుడు చేసిన గీతాబోధను గరించియు ముందు విపులముగా చెప్పబడును.

4, ''తు అను శబ్దమునకు నాల్గవ అర్థము:- ధృతరాష్ట్రుడు అనుకున్నట్లు పాండవులకు దృష్టభయము కల్గలేదు గాని ధర్మరాజుకు మాత్రము అధర్మభయము కలిగినదని సూచించుటకు ''తు'' శబ్దప్రయోగము చేయబడినది. అధర్మబయం యెట్లుకల్గినది. అనగా, గురువులైన భీష్మద్రోణాదులతో ధర్మరాజునకు యుద్ధము చేయవలసిన పరిస్థితి ఏర్పడుటచేత, అట్టి గురువుల అనుజ్ఞ లేనిదే యుద్ధము చేయుట అధర్మము కనుక, అట్టి అధర్మము సంప్రాప్తించునను భయము కల్గినది. అట్టి అధర్మ భయమును పోగొట్టు కొనుటకుగాను ధర్మరాజు కవచాదులను వదలి పాదచారియై సవినయముగా గురువులైన భీష్మద్రోణాదుల వద్దకువెళ్ళి వారికి సాష్టాంగ దండప్రణామము లాచరించి వారితో యుద్ధము చేయుటకు వారి అనుమతిని యివ్వవలసినదిగా ప్రార్థించెను. అంతట భీష్మద్రోణాదులు ధర్మరాజుయొక్క గురుభక్తికి యోగ్యతకు సంతోషించి, జయము కలుగునట్లు ధర్మరాజును ఆశీర్వదించిరి. ఇట్లు ధర్మరాజు తన అధర్మభయమును పోగొట్టుకొనెను. అను పైవిషయమున్ను సూచితమగుచున్నది.

5. పైన తెలియజేసిన ప్రకారం అర్జునునికి అదృష్టభయమునుకల్గినను అర్జునుడు దానిని పోగొట్టుకొనగల్గినాడు; ధర్మరాజుకు కల్గిన అధర్మభయమును ధర్మరాజు పోగొట్టు కొనగలిగినాడు కాని దుర్యోధనునికి కలిగిన దృష్టభయమును మాత్రము దుర్యోధనుడు పోగొట్టుకొనలేకపోయెను. ఈ భావమును గూడా ''తు'' శబ్దప్రయోగము సూచించు చున్నది. ఇట్లు దుర్యోధనుడు తన గురువర్యులైన ద్రోణాచార్యులవద్దకు వెళ్ళి వారితో పాండవసేనలోని వీరాగ్రేసరులను తన సేనలోని వీరాగ్రేసరులను వర్ణించుటలో వ్యక్తము, చేసిన భయమును పోగొట్టి ధైర్యము కల్గించుటకై భీష్ముడు తన శంఖమును గట్టిగా పూరించి గొప్ప ప్రోత్సాహనాదమును గావించెను. అంతట కౌరవసేనలోని మిగతా యోధులున్ను తమతమ శంఖములను పూరించిరి. తదుపరి పాండవసేనలో ముఖ్యులైన కృష్ణుడు అర్జునుడు భీముడు మొదలగువారందరు తమతమ శంఖములను పూరించగా బయలు దేరిన ధ్వని భూనభోంతరాళము లంతయు వ్యాపించుటయేగాక కౌరవసేనలోని వారందరికి గుండెలు బ్రద్దలాయెనా యనునట్లుగా భయమును కల్గించెనని సంజయుడు దృతరాష్ట్రునితో చెప్పెను.

ధృతరాష్ట్రుని ప్రశ్నలో పూర్వము వ్యక్తము చేయబడిన (9) భావములలో మొదటి ఆరు భావములకు యింత వరకు సమాధానము విశదమైనది. 7వ భావములో ధృతరాష్ట్రుడు చివరకైననూ కౌరవులకు జయము కల్గుటకు అవకాశము లేదా యను ఆశను వ్యక్తము చేయుటచేత అందుకు సమాధానముగా సంజయుడు గీతలోని చివరశ్లోకమయిన

'యత్ర యోగీశ్వరః కృష్ణోయత్రపార్థో ధనుర్ధరః |

తత్రశ్రీర్విజయోభూతిర్ధ్రువానీ తిర్మతిర్మమ||

అను శ్లోకమును చెప్పెను. దీని భావము ఏమనగా యోగీశ్వరుడు అయిన కృష్ణుడున్ను ధనుర్ధారియైన అర్జునుడున్ను యున్న పక్షమునకే, అనగా పాండవ పక్షమునకే జయము కల్గును అని సంజయుడు చెప్పుటచేత, కౌరవులకు జయము కల్గదు అని సూచించెను. దీనివలన ధృతరాష్ట్రునికి యున్న ఆ ఆశకూడా నిరాశ అయ్యెను.

'ధర్మక్షేత్రే కురుక్షేత్రే' అను శ్లోకమునకు పూర్వము చెప్పబడిన 9వ అర్థములలో 8, 9 అర్థములు రెండును చరిత్రాత్మకమైన భావముకు సంబంధించినవి గాక ఆధ్యాత్మికమైన భావముకు సంబంధించినవి యగుటచేత ఆ రెంటికిని ఆధ్యాత్మికముగానే సమాధానము చెప్పుకొనవలసియున్నది. ఆ రెంటిలోని భావము అజ్ఞానియైన జీవుడు తరించుటకు కావలసిన సాధనములకు సంబంధించినదియై యున్నది. ఆ 8, 9 భావములకు సమాధాన మేమనగా - జ్ఞాననేత్రములేక దేహమే తాను అనుకొను దేహాభిమానముకల శిష్యుడు జ్ఞానియైన గురువును తరుణోపాయము చెప్పమని అడుగుటయే ధర్మక్షేత్రే' అను శ్లోకముయొక్క సారమగుటచేత దానికిన్నీ సమాధానమును సంజయుడు చివర శ్లోకము అయిన 'యత్ర యోగీశ్వరః' అను శ్లోకముద్వారా వ్యక్తము చేసినట్లు భావించవచ్చును. అది ఎట్లు అనగా, ఆధ్యాత్మికార్థము చెప్పుకొన్నప్పుడు 'కృష్ణుడు' అను శబ్దమునకు అర్థము దేవుడనిన్నీ, అర్జునుడను శబ్దమునకు అర్థము జీవుడు అనిన్నీ గ్రహించవలసియున్నది. ఏల అనగా, వారిద్దరు నరనారాయణులని స్పష్టమేగదా. అజ్ఞానియైన జీవుని అంతఃకరణలో మంచిగుణములకు చెడ్డగుణములకు నిత్యము జరుగు పోట్లాటయే కురుక్షేత్ర యుద్ధముకు ఆధ్యాత్మికార్థము. అట్టి పోట్లాటలో చెడ్డగుణముల నణిచివేసి మంచిగుణముల ద్వారా ధర్మమను పంటను జ్ఞానమను పంటను జీవుడు సంపాదించుకొని తరించుటకు కావలసిన సాధనములను, ఆ సాధనములను అభ్యసించుటవల్ల వచ్చే ప్రయోజనములను యీ చివర శ్లోకములో సంజయుడు వ్యక్తము చేసినాడు. ధనుర్ధారి అయిన పార్థుడు అనుటవల్ల పార్థుడు క్షత్రియుడు కనుకను. క్షత్రియునకు యుద్ధము స్వధర్మము కనుకను ధనస్సును ధరించిన అర్జునుడు అంటే స్వధర్మమైన యుద్ధము చేయుటకు సిద్ధముగానున్న అర్జునుడని అర్థము. అర్జునుడు అనగా జీవుడు అని అర్థము కనుక, ధనుర్ధారియైన అర్జునుడు అంటే స్వధర్మమును నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా చేయుటకు సిద్ధముగానున్న జీవుడు అనిఅర్థము. అట్టి జీవుడు యోగీశ్వరుడు అయిన కృష్ణుని సేవించుట అంటే, యోగాభ్యాసము ద్వారా, భక్తి ద్వారా భగవంతుని సేవించుట అని అర్థము.

'ప్రణవోధనుశ్శరో హ్యో త్మాబ్రహ్మతల్లక్ష్యముచ్యతే

అప్రమత్తేన వేద్ధవ్యః శరవత్తన్మయోభ##వేత్‌'

అను మంత్రముకు ప్రణవమేధనస్సుఅనిన్నీ, జీవాత్మ బాణమనిన్నీ, బ్రహ్మ లక్ష్యమనిన్నీ, ఎట్టి పొరబాటులేకుండా గురి తప్పకుండా బాణము వేసినయెడల, ఆబాణము లక్ష్యముతో ఏకమగును. అంటే, జీవాత్మ బ్రహ్మతో ఐక్యమును చెందును అనిన్నీ అర్థము కనుక, యీ మంత్రార్థమును యీ శ్లోకములోని 'ధనుర్ధరః పార్థః' అను శబ్దప్రయోగము ద్వారా ఈ శ్లోకములోనికి అనుసంధానము చేసికొనవలసి యున్నది. అట్లు చేసినచో తేలిన పర్యవసాన మేమనగా - జీవుడు నిష్కామముగా స్వధర్మనుష్ఠానమును, యోగాభ్యాసమును, భక్తిని చేస్తూ, ప్రణవోపాసనమును, శ్రవణమనన ధ్యానములను జ్ఞానయోగమును అవలంబించితే నీతి, భూతి, విజయము, శ్రీ అను నాలుగు ప్రయోజనములు క్రమముగా కలిగి ఆ జీవుడు తరించునని అర్థము.

నీతి అనగా లోకములో అందరితోను మంచిగా నుండుట. భూతి అనగా భగవదనుగ్రహమునకు పాత్రుడగుట. విజయము అనగా ఇంద్రియ జయము, మనో జయము, అవిద్యాజయము. శ్రీ అనగా మోక్షలక్ష్మి, ఇట్లు గీతలో చివరిశ్లోకములో జీవుడు తరించుటకు అవసరమైన సాధనములున్ను దానివల్ల క్రమేణావచ్చే ప్రయోజనములున్ను చివరికి మోక్షఫలమున్ను వర్ణించబడినవని ఈశ్లోకమునకు ఆధ్యాత్మికార్థము. ఇట్టి ఆధ్యాత్మికార్థము వచ్చులాగును ఆ శ్లోకమును మార్చినచో ఆ శ్లోకరూప మిట్లుండును. 'యత్ర యోగేశ్వరోదేవః, యత్రజీవస్స్వధర్మకృత్‌ తత్రశ్రీ ర్విజయో భూతిర్ధ్రువా నీతిశ్చ శాశ్వతీ,'

ఇంకను గీతలోని మొదటి శ్లోకమునకు ఆధ్యాత్మికార్థమును చెప్పుకొని ఆ శ్లోకములోని ప్రశ్న తరుణోపాయము లకు సంబంధించిన ప్రశ్న అని అర్థము చేసుకొనినప్పుడు, గీతలోని 18 అధ్యాయములున్ను 18 మోక్షసాధనములను బోధించుచున్నవి అని ఆ ప్రశ్నకు సమాధానము చెప్పుకొనవచ్చును. అర్జునవిషాదయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము అని ఈ విధముగా ప్రతిఅధ్యాయము ఒక్కొక్క యోగమును బోధించుచున్నది. యోగము అనగా కలుపునది; అనగా జీవాత్మను పరమాత్మతో ఐక్యము పొందించుటకు సాధనము అని అర్థము. కనుక 18 అధ్యాయములున్ను 18 మోక్షసాధనములను బోధించుచున్నవి అని స్పష్టము ఇదియే సంజయుని సమాధానము.

Geetha Koumudi-1    Chapters